పార్కింగ్ బైకులే టార్గెట్..!
– డూప్లికేట్ కీలతో 20 వాహనాల చోరీ
– మరో రెండు ఆటోలు కూడ దొంగతనం
– ముగ్గురు స్నేహితుల ముఠా దొంగల గుట్టు రట్టు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: జల్సాల కోసం సరదాగా ప్రారంభించిన దొంగతనం అలవాటుగా మార్చుకున్నారు ముగ్గురు స్నేహితులు. ముఠాగా ఏర్పడి పార్కింగ్ చేసిన బైకులను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడ్డారు. ఎత్తుకొచ్చిన బైకులను సొంత ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బులను సమానంగా పంచుకున్నారు. అనుకోకుండా పోలీసుల తనిఖీలో పట్టుబడి కటకటాల పాలయ్యారు. నిందితులతో పాటు వాహనాలను కొనుగోలు చేసిన వారు కూడ ఈ కేసులో నిందుతులు కావడం విశేషం. దాదాపు 20 బైకులు, రెండు ఆటోలను దొంగిలించిన ముగ్గురు స్నేహితుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. సోమవారం తాండూరు డీఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండలం కమాల్ పూర్ గ్రామానికి బోయిని శ్రీకాంత్, మ్యాతరి బాస్కర్, మ్యాతరి శివలు స్నేహితులు. వీరంతా హైదరాబాద్‌లో ఆటో డ్రైవింగ్ చేసేవారు. ఆటో డ్రైవింగ్ తో వచ్చిన డబ్బులు సరిపోక పోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే బైకులను దొంగతనం చేసి అమ్ముకుని వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోనే పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పార్కింగ్ సెంటర్ల నుంచి బైకులను తాళాలు విరగొట్టి, డూప్లీకేట్ తాళాలతో ఎత్తుకెళ్లి తక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు.
హైదరాబాద్ టు తాండూరు
గత నాలుగు నెలలుగా ముగ్గురు స్నేహితులు వరుస దొంగ తనాలకు పాల్పడ్డారు. హైదరాబాద్ లో చోరీ చేసిన బైకులను తాండూరుకు తీసుకవచ్చి తక్కువ ధరకే ఆమె మ్మవారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, బంజార హిల్స్, సనత్ నగర్, బాచుపల్లి, చందానగర్, యూసుఫ్ గూడతో పాటు యాలాల మండలంలో కూడ దొంగతనాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 20 బైకులతో పాటు రెండు ఆటోలను చోరీ చేశారు.

ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ఎస్పీ
యాలాల మండలం గోవింద్ రావు పేటకు చెందిన మహేంద్రకర్ అనిల్ కుమార్ తన బైకు లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తా నుంచి, హైదరాబాద్ లోని మాదాపూర్ కు చెందిన తుమ్మల సంతోష్ వెంకోబా గార్డెన్ వద్ద పార్కు చేసిన బైకు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుస బైకుల చోరీపై వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం యాలాల పోలీసులు లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బోయిని శ్రీకాంత్, మ్యాతరి బాస్కర్, మ్యాతరి శివలు బైకుతో పట్టుబడ్డారు. పోలీసులు వాహనాలకు సంబందించిన పత్రాలు చూపించకపోవడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పట్టుకుని తనదైన శైలిలో విచారించగా వరుస చోరీలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు వెల్లడించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వరుస చోరీల కేసు పరిష్కారం కావడంతో సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాయలంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియాతో సమావేశం అయ్యారు. పార్కింగ్ సెంటర్లలో ఉన్న బైకులను ఈ ముగ్గురు స్నేహితులు ముఠాగా ఏర్పడి చోరీలు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ముగ్గురు స్నేహితులు చేసిన బైకులను పెద్దేముల్ మండలానికి చెందిన బోయిని ఆనంద్ కు 9 బైకులు, యాలాల మండలం అక్కంపల్లి గ్రామం తుప్పలి మహిపాల్ కు 4 బైకులను విక్రయించారని తెలిపారు. చోరీ చేసిన బైకులని తెలిసీ వాహనాలను కొనుగోలు చేసినందుకు నిందితులుతో పాటు వారిపై కూడ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. చోరీ చేసిన బైకులు, ఆటోల విలువ రూ. 15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. కేసు చేదనలో ప్రతిభను కనబరిచిన ఎస్ఐ అరవింద్, కానిస్టేబుల్ ను అభినందించారు. వారికి తగిన రివార్డులను అందిస్తామన్నారు. ఈ సమావేశంలో తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు. ఎస్ఐలు అరవింద్. వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


