ప్రభుత్వ అధికారిని కిడ్నాప్‌ చేసిన పోలీసులు

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

ప్రభుత్వ అధికారిని కిడ్నాప్‌ చేసిన పోలీసులు
– రూ. 5లక్షలు ఇవ్వకుంటే తప్పుడు కేసులంటూ బెధిరింపులు
– చివరకు లక్షన్నర లాక్కుని వదిలేశారు
దర్శిని డెస్క్‌: కంచె చేనుమేసినట్లు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఓ ప్రభుత్వాధికారిని కిడ్నాప్‌ చేశారు. రూ.5లక్షలు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తామని బెదిరించారు. చివరకు రూ. 1లక్ష 55వేలు లాక్కుని వదిలేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌, బెధిరింపులకు పాల్పడిన పోలీసులను పోలీసులే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జాతీయ మీడియా కథనం మేరకు జీటీబీ ఎన్‌క్లేవ్‌లో కుటుంబంతోపాటు నివసించే ఓ వ్యక్తి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ట్యాక్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 11వ తేదీన సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఆయన కారును ముగ్గురు వ్యక్తులు కారుతో అడ్డగించారు. క్రైం బ్రాంచి అధికారులమని చెప్పి క్షణాల్లోనే అతన్ని బలవంతంగా ఆయన కారులోకి ఎక్కి దాడికి పాల్పడ్డారు. కారులోనే తుపాకీతో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.35వేలను లాగేసుకున్నారు. వెంటనే నిన్ను వదిలేయాలంటే మాకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తప్పుడు కేసులు నమోదు చేయించి అరెస్టు చేస్తామని బెదిరించారు. వారి కారులో మరోప్రాంతానికి తీసుకెళ్లి ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలను బదిలీ చేయించుకున్నారు. అక్కడితో ఆగకుండా ఇతరుల వద్ద నుంచి రూ.70వేలను తీసుకునేలా చేశారు. వాటిని కూడ పోలీసులు వారి ఖాతాలో జమ చేయించుకున్నారు. మొత్తం రూ. 1లక్ష 55 వేలను దోచుకుని వదిలేశారు. ఈ విషయాలను ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించి వదిలేశారు. అక్కడి నుంచి బయటపడిన అధికారి పోలీసులను సంప్రదించి జరిగిన సంఘటనను మొత్తం పోలీసులకు వివరించాడు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడింది అమిత్‌ అనే కానిస్టేబుల్‌ అని పోలీసులు నిర్వహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌, దోపిడి కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమిత్‌తో పాటు సీమాపురి పోలీసుస్టేషన్‌లోని ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు వ్యక్తులు ఇందులో భాగస్వామ్యం అయినట్లు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో ఓ ఎస్సై కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆ దిశగా కూడ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.