పేదలకు కేంద్రం వరం

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

పేదలకు కేంద్రం వరం
– ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు
– దేశంలో 81.35 కోట్ల మందికి లబ్ది
– జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్ణయం
దర్శిని డెస్క్: దేశంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం మరో వరం అందించబోతోంది. అర్హులైన నిరుపేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోడి ఆధ్వర్యంలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై చర్చించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు ఏడాదిపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకు ఖర్చు అయ్యే రూ.2 లక్షల కోట్లు వ్యయంను కేంద్రమే భరించాలని భావిస్తున్నారు. ఎన్‌ఎఫ్‌సీఏ ప్రకారం రాయితీ ధరలలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన(పీఎంజీకేఏవై) కింద ఉచితంగా బియ్యం, గోధుమలు అందిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రెండు పథకాలను విలీనం చేసి అంత్యోదయ అన్నయోజన కిందికి వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున, మిగతా వారికి నెలకు తలసరి 5 కిలోల చొప్పున ఉచితంగా వీటిని ఇవ్వాలని నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద పంపిణీ చేసే బియ్యంపై కిలోకు రూ.3, గోధుమలపై రూ.2, చిరుధాన్యాలపై రూ.1 వసూలు చేస్తున్న ఆ మొత్తాలను వసూలు చేయకుండా ఆహారధాన్యాలను పేదలకు పూర్తి ఉచితంగా అందించాలని కేంద్రం చర్యలకు సిద్దమయ్యింది. దీనివల్ల 81.35 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు రాయితీ ధరల్లో కొనుగోలుచేసే వారికి ఇకమీదట పూర్తిగా ఉచితంగా అందుతాయి. ఇదివరకు 35 కిలోల తిండిగింజలు లభించేవారికి ఇప్పుడు కూడా అంతే అందుతుంది. మిగిలినవారికి తలసరి 5 కిలోల చొప్పున లభిస్తాయి. 2023 డిసెంబరు వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ఇదివరకు కొవిడ్‌ కాలంలో పేదల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నందున పీఎంజీకేఏవై కింద తిండిగింజలు ఉచితంగా అందించేవారని, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ వారికి ఉపశమనం కలిగించడానికి ఆహారభద్రత చట్టం కింద సబ్సిడీ ధరల్లో ఇచ్చే గింజలనే ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన అందులోకే విలీనం అవుతుందన్నారు. దీనిపై కేంద్రం తీర్మానించినట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.