మత్స్యకారుల గోస పట్టించుకోరా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మత్స్యకారుల గోస పట్టించుకోరా..!
– చెరువులో గుర్రపు డెక్క పెరిగి ఉపాధికి దెబ్బ
– తొలగించడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం
– మండిపడిన తాండూరు కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాలకులకు, అధికారులకు మత్య్సకారుల గోస పట్టదా అని తాండూరు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తాండూరులోని గొల్ల చెరువు, మత్స్యకారులపై పాలకులకు, అధికారులకు ఉన్న చిత్తశుద్ధి కరువైపోయిందని ద్వజమెత్తారు. గత కొన్నేండ్లుగా చెరువులో పాతుకు పోయిన గుర్రపు డెక్క మొక్కలను మత్స్యకారులు గత పది రోజులుగా స్వచ్ఛందంగా తొలగింపు చేస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులోని ఏకైక జలాశయం గొల్ల చెరువు సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చెరువులో సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు. చెరువులో గుర్రపు డెక్క పాతుకుపోవడంతో మత్య్సకారులు జీవనోపాధికి దెబ్బ పడిందని ఆవేధన వ్యక్తం చేశారు. వాటిని తొలగించే క్రమంలో చెరువులో దిగిన వారికి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించాలని. ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, చైర్ పర్సన్ లు సైతం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును కాపాడి, మత్స్యకారులకు ముప్పును తొలగించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ కార్యదర్శి కావలి సంతోష్, నాయకులు బాతుల వెంకటయ్య, భీంశంకర్, మత్స్యకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.