స్మశానంలో ఎముకల భోజనం
– మహిళకు పిల్లలు పుట్టాలని ఘాతుకం
– దగ్గరుండి తినిపించిన భర్త, కుటుంబ సభ్యులు
దర్శిసి డెస్క్: సాకేంతికత కొత్త పుంతలు తొక్కుతున్న సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు జడలు విప్పుతూనే ఉంది. ఆ నమ్మకాలను విశ్వసిస్తూ ఎన్నో వికృత చేష్టలు సాగిస్తుంటారు. తాజాగా ఓ మహిళకు పిల్లలు పుట్టడం లేదని స్మశానంలో ఎముకల భోజనం పెట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె, ధైరీ ప్రాంతంలోని సింహగడ్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళకు సంతానం కలగలేదని భర్త సహా కుటుంబ సభ్యులు ఆమెను కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. ఆమెపై నరబలి, జంతుబలి చేసే మాంత్రికుడితో క్షుద్ర పూజలు చేయించారు. చివరకు శ్మశానంలో ఆ మహిళను కూర్చోబెట్టి ఆమె చేత ఎముకలు తినిపించారు. భర్త, కుటుంబ సభ్యులు తినిపించారు. వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు సహా 8 మందిపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలీ చకంకర్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.

