అర్దరాత్రి ఇసుకాసురులపై వేట

క్రైం తాండూరు వికారాబాద్

అర్దరాత్రి ఇసుకాసురులపై వేట
– ట్రాక్టర్‌ను పట్టుకున్న పోలీసులు
– పెద్దేముల్ పోలీస్టేషన్‌లో కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎవరి అండ చూసుకునో.. తాండూరులో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారో అర్థం కావడం లేదు. గత కొన్ని రోజులుగా కాదు నెలలుగా అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ పోలీసులు అర్దరాత్రి ఇసుకాసురులపై వేట ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పెద్దేముల్ మండల పరిధిలోని రేగోండి, బిజ్జరం గ్రామ శివారులోని వాగులో నుండి ఇసుక అక్రమంగా ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ నారాయణ పోలీస్ సిబ్బందితో నిఘా ఉంచారు. కొద్ది సేపటి తరువాత అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్(TS.0.UB.4213)ను అడ్డుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి పత్రాలను చూపించాలని కోరితే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు జరిపి డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.