మేధో శక్తిని మదిస్తే లక్ష సాధన సులభం
– ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
– శాలివాహన వ్యక్తిత్వ వికాసంలో విద్యావేత్తలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మనిషిలోని మేధోశక్తిని మదిస్తే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని ప్రముఖ మహా విద్యావేత్తలు డా.కన్నెగంటి రమేష్, డా. పల్లవి కబ్డే, డా.సురేష్ కొండేజులు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్లో శాలివాహన డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పర్సనాలటీ డెవలప్ మెంట్ అండ్ కేరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యావేత్తలు డా. కన్నెగంటి రమేష్, డా. పల్లవి కబ్డే, డా.సురేష్ కొండేజులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు, ఉద్యోగ సాధనకు, జీవితంలో ఏర్పరుచుకున్న లక్ష్యాల నెరవేర్పుకు సంబంధించి సలహాలు, సూచనలు అందజేశారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించుకునేందుకు ఎదురయ్యే ప్రతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమలోని మేధో శక్తిని చక్కగా వినియోగించుకున్నట్లు అయితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమన్నారు. కష్టపడి చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలన్నారు. సోమరి తనాన్ని వీడి ఏకాగ్రతతో చదివితే లక్ష్యాలను సాధించడం సులభతరం అవుతుందన్నారు. చదువుతో పాటు దేశభక్తి, దైవభక్తిని పెంపొందించుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటి వాటికి బానిస కారాదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అనురాధ రమేష్. డైరెక్టర్ మడపతి సిద్ధలింగయ్య, ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ శరత్ చంద్ర, అద్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

