మున్సిపల్ చైర్ పర్సన్‌లకు ఊరట
– అవిశ్వాసంపై స్టే నెల రోజుల పొడగింపు
– వ్యతిరేకులకు మిగిలిన భంగపాటు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని మున్సిపల్ చైర్ పర్సన్‌లకు ఊరట లభించింది. చైర్ పర్సన్‌లకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన వారిని మరోసారం భంగపాటు కలిగింది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు మున్సిపాల్టీలలో అధికార పార్టీకి చెందిన మంజుల రమేష్, స్వప్న పరిమళ్‌లు కొనసాగుతున్నారు. అధికార పార్టీ నుంచే వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి దిగడం రాజకీయ సంచలనంగా మారింది. గతనెలలో ఇద్దరు చైర్ పర్సన్‌లు మూడేళ్ల పదవి కాలం పూర్తి చేసుకోవడంతో కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం వారిపై అవిశ్వాస తీర్మానాలను ప్రకటించారు. వికారాబాద్‌లో కౌన్సిలర్ పుష్పలతారెడ్డి ఆధ్వర్యంలో మెజార్టీ కౌన్సిలర్లు ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించగా తాండూరులో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. సొంత పార్టీ నుంచి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాండూరులో ప్రతిపక్ష కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. గత నెల జనవరి 28వ తేదిన వికారాబాద్, తాండూరు మున్సిపాల్టీలకు సంబంధించి ఒకే రోజు ఇద్దరు చైర్ పర్సన్‌లపై అవిశ్వాసం ప్రకటించి జిల్లా కలెక్టర్‌కు నివేదికలను అందజేశారు. అవిశ్వాసం ప్రకటించిన వెంటనే ఇద్దరు చైర్ పర్సన్‌లు హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నారు. అవిశ్వాస తీర్మానాల ఆమోదం నిబంధనలను ఇంకా రూపొందించలేదని వాదనల సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి స్టేలు తీసుకవచ్చారు. దీంతో ఈనెల 21 వరకు అవిశ్వాసాలపై గడువు ముగిసింది. మళ్లీ వారు అవిశ్వాసాలపై మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను మరో నెల రోజుల పాటు పొడగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌లకు ఊరట లభించింది. కాని అవిశ్వాసం నెగ్గాలనే పంతంతో ఉన్న వ్యతిరేకులకు భంగపాటు మిగిలింది. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో అని రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

