స్వచ్ఛ తాండూరు లక్ష్యంగా..
– భాధ్యతగా పారిశుద్ధ్య పనులు చేపట్టండి
– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
– మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణాన్ని స్వచ్ఛ తాండూరుగా మార్చడమే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం తెల్లవారు జామున మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు.
తాండూరు ఆర్డీఓ, మన్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌తో కలిసి కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్‌లో చేపట్టిన గల్లిగల్లికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. కాని వార్డుల్లో నామమాత్రపు పనులు చేపడుతున్నారనే ఆరోపణలు తమ దృష్టికిరావడంతో కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. కార్మికులు విధుల్లో బాధ్యతగా ఉండాలన్నారు. వార్డులు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కార్మికులదేనని, ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని కావున పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు మురుగు కాలువలు శుభ్రం చేసి, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, నీరు నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ ఉపయోగించాలని దిశానిర్దేశం చేశారు. ఆయా వార్డుల్లో ఏర్పాటుచేసిన డస్ట్ బిన్లో పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.
అదేవిధంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే చోట ఎప్పటికప్పుడు పారిశుధ్యం పాటించాలన్నారు. అలసత్వం వీడి.. స్వచ్ఛ తాండూరుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలన్నారు. వచ్చే వారం మళ్ళీ వచ్చి పనితీరును గమనిస్తానని, తీరు మార్చుకోని సిబ్బందిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఆర్డీవో అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బందిని ప్రక్షాళన చేసి అయ్యా వార్డులకు కేటాయించడం జరుగుతుందని ఆ వార్డులో కేటాయించి సిబ్బంది పేర్లను వారి ఫోన్ నెంబర్లను స్థానికంగా అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, అఫ్పూ(నయూం), శ్రీనివాసాచారి, ఉర్దూ ఘార్ చైర్మన్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.


