మద్యం మత్తులో గొడవై..!

క్రైం తాండూరు వికారాబాద్

మద్యం మత్తులో గొడవై..!
– స్నేహితుని గొంతుకోసిన మిత్రుడు
– మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు
– తాండూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
– నిందితున్ని అరెస్టు చేసి.. రిమాండుకు పంపిన పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఇద్దరి స్నేహితుల మద్య మద్యం విషయంలో గొడవ జరిగింది. అదే మత్తులో స్నేహితుని గొంతు కోశాడు తోటి మిత్రుడు. ప్రాథమిక చికిత్స తరువాత బాధితుని పరిస్థితి ఆందోళన కరంగా మారింది. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకోవడం.. రిమాండుకు పంపడం జరిగింది. ఇందుకు సంబంధించి కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం చింతామణి పట్నం గ్రామానికి చెందిన గుడాటి బల్వంత్ రెడ్డి (27) అదే గ్రామానికి చెందిన కుర్వ శ్రీశైలంలు స్నేహితులు. బల్వంత్ రెడ్డి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుండగా.. కుర్వ శ్రీశైలం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. గత సోమవారం శ్రీశైలం బల్వంత్ రెడ్డిని ఇంటికి పిలిచాడు. ఇంట్లో వారు మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మద్య ఏదో విషయంలో వాగ్వివాదం జరిగింది. దీంతో కోపంతో ఉన్న శ్రీశైలం ఒక్కసారిగా కత్తితో బల్వంత్ రెడ్డి గొంతును కోశాడు. గాయంతోనే బల్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తరువాత వైద్యులు బల్వంత్ రెడ్డిని ఇంటికి పంపించారు. రెండు రోజుల తరువాత బుధవారం బల్వంత్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంభీకులు అతన్ని హైదరాబాద్ కు తరలించారు. మరోవైపు బల్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులు నిందితుడు శ్రీశైలంపై కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు బుధవారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు.