సమావేశాలు లేకుండా సంతకాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

సమావేశాలు లేకుండా సంతకాలు
– నిధుల వినియోగంలో నిర్లక్ష్యం
– వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు నివేధిక
– జిల్లా విద్యాధికారి రేణుకా దేవి
తాండూరు, దర్శినిప్రతినిధి : పాఠశాల నిర్వహణపై సమావేశాలు నిర్వహించకుండా సంతకాలు తీసుకుని నిధులు డ్రా చేసుకోవడం తప్పు అని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి అన్నారు. తాండూరు పట్టణం గాంధీనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం మంజుశ్రీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఈఓ రేణుకాదేవికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌తో కలిసి పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయురాలు మంజుశ్రీ, ఎస్ఎంసీ చైర్మన్, కౌన్సిలర్ లతో కలిసి డీఈఓ రేణుకా దేవి విచారణ చేపట్టారు. ఎస్ఎంసీ నిధుల నుంచి రూ. 11,104లు నిధులు డ్రా చేసుకోవడం జరిగిందని గుర్తించారు. అయితే ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా సంతకాలు తీసుకుని నిధులు డ్రా చేసుకున్నారని తేలిందని వివరించారు. సమావేశాలు నిర్వహించకుండా సంతకాలు తీసుకుని నిధులు డ్రా చేసుకోవడం తప్పే అన్నారు. ఇందులో ఉపాధ్యాయురాలు నిర్లక్ష్యం చేశారని అభిప్రాయపడ్డారు. ఈ నివేధికను వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందిస్తామని, ఆమెపై శాఖ పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

పాఠశాలను సక్రమంగా వినియోగించుకోండి

అంతకుముందు డీఈఓ రేణుకాదేవి పాఠశాల గదులను, మధ్యాహ్న భోజనంను తనిఖీ చేశారు. అయితే పాఠశాలలో తరగతి గదులు ఖాళీగా ఉన్న ఒకే గదిలో అన్ని తరగతులను నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న గదులలో వేరు వేరుగా తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో తాగునీటి, మరుగుదొడ్లు సమస్యలను దశలవారిగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత ఠాకూర్, ఉపాధ్యాయులు ఉన్నారు.