మూడు నెలల్లో ముగియనున్న ఎమ్మెల్సీ పదవికాలం
– జనవరి 4 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్న మహేందర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే యేడాది 12 మంది ఎమ్మెల్సీల పదవి కాలం పూర్తికాబోతుంది. సరిగ్గ మూడు నెలల్లోపు ఎమ్మెల్సీలు వారి పదవి కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై మహేందర్‌రెడ్డి పరాజయం పొందారు. ఆ తరువాత మేలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిరెడ్డిపై విజయం సాధించారు. అదే ఏడాది జూన్ 19న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా తెలంగాణలోని శాసన మండలిలో స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీగా పదవికాలం వచ్చే యేడాది జనవరిలో పూర్తి కాబోతుంది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా మహేందర్‌రెడ్డి జనవరి 4వ తేది వరకు కొనసాగనున్నారు. పదవి కాలం పూర్తిచేసుకోబోతున్న ఎమ్మెల్సీల జాబితాలో ప్రోటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంబీపూర్ రాజు, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, తేరా చిన్నపరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పురాణం సతీష్ కుమార్, కసిరెడ్డి నారాయణరెడ్డి, నారదాసు లక్ష్మణరావులు ఉన్నారు.
