కాగ్నానదిలో గండిపై ఎమ్మెల్యే సీరియస్
– సమగ్ర విచారణకు ఆదేశించిన పైలెట్ రోహిత్ రెడ్డి
– నిందితులను అరెస్టు చేయాలని ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ సమీపంలోని కాగ్నానది చెక్ డ్యాం పక్కనుంచి కొందరు అక్రమార్కులు గండి సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించి సీరియస్ అయినట్లు తెలిసింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తాండూరు పట్టణ వాసులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా కోట్లాది రూపాయిలతో ఈ చెక్ డ్యాంను నిర్మించారు. చెక్ డ్యాం సమీపం నుంచే గత కొన్నేళ్లుగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. ఇటీవల కాగ్నా చెక్ డ్యాంకు పక్క నుంచి కొందరు అక్రమార్కులు గండి కొట్టారు. ఈవిషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కాగ్నానదిలో గండి కొట్టిన అక్రమార్కులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నిందితులు ఎవరైనా సరే ఆరెస్టు చేయాలని సూచించినట్లు సమాచారం. అదేవిధంగా నీరు నిల్వ కాకుండా కొట్టిన గండిని వెంటనే పూడ్చేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కూడ ఆదేశించారు. మరోవైపు కాగ్నాలో కొట్టిన గండిపై అక్రమ ఇసుక వ్యాపారులపై వచ్చిన ఆరోపణలను కొందరు వ్యాపారులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాగ్నానది సమీప పొలాల రైతులే చెక్ డ్యాం పక్కనుంచి గండి కొట్టారని ప్రచారం చేశారు. ఏదేమైనా కాగ్నానది చెక్ డ్యాం ఎక్క నుంచి నీటి నిల్వ కుండా గండి కొట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

