టీబీ రహిత సమాజం అందరి బాధ్యత
– అప్రమత్తంగా ఉంటే క్షయ నియంత్రణ సాధ్యం
– క్షయవ్యాధి నియంత్రణ జిల్లా అధికారి డా. రవీంద్ర యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీబీ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత అని క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డా. రవీంద్రయాదవ్ అన్నారు. క్షయ వ్యాధి నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలో ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పురవీధుల్లో నినాదాలు చేసుకుంటూ జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్షయ నియంత్రణ జిల్లా అధికారి డా. రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ క్షయ వ్యాధికి గురైతే ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నుంచి కాపాడుకోవచ్చన్నారు. అదేవిధంగా వ్యాధి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో బాధితులకు ఆరునెలల పాటు ఉచితంగా మందులను అందజేస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థల స హాకారంతో బాధితులకు పౌష్టికాహార కిట్లను కూడ అందజేయడం జరుగుతుందన్నారు. వ్యాధిని నియంత్రించేందుకు అందరు తోడ్పాటు అందించాలన్నారు. టీబీ రహిత సమాజం నిర్మాణం అందరి బాధ్యత అన్నారు. అనంతరం టీబీపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు’ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి వైద్యులు డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, డా. సమీవుల్లా, డా. గిరిధర్, టీబీ నియంత్రణ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

