డబుల్ అర్హుల వేట షురూ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్ అర్హుల వేట షురూ..!
– ప్రత్యేక బృందాలతో ఇంటింటి విచారణ
– దరఖాస్తుల్లో అర్హులైన లబ్ధిదారులు జల్లెడ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ద్వారా తాండూరు ప్రజలకు మంజూరు చేయబోతున్న డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీలో అర్హుల వేట ప్రారంభమయ్యింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గత వారం తాండూరు మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ ఇండ్లకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 36 వార్డుల నుంచి మొత్తం 9436 దరఖాస్తులు అందాయి. ఇందులో నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకు తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను నియమించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, ఆర్పీలు, సిబ్బంది కూడిన 147 మందితో ఈ బృందాలను ఏర్పాటు చేశారు.

గురువారం నుంచి తాండూరు మున్సిపల్ పరిధిలో డబుల్ దరఖాస్తుల్లో అర్హుల వేట ప్రారంభమయ్యింది. బృందాల సభ్యులు ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారు. దరఖాస్తుల దారులకు నిజంగా నిరుపేదలేనా..? ఇళ్లు ఉందా.. లేదా..? గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇళ్లు పొందారా..? ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇండ్లకు అర్హులా.. కాదా..? అనే అంశాలపై విచారణ చేపట్టి.. అర్హులను జల్లెడ వేస్తున్నారు. మొత్తం 6 రోజుల పాటు క్షేత్రస్థాయి విచారణ జరిపి.. జిల్లా కలెక్టర్‌కు నివేధిక అందిస్తామని తహసీల్దార్ చిన్నప్పల నాయుడు తెలిపారు.