రక్తదానం అభినందనీయం
– తాండూరు ఫైర్ ఆఫీసర్ నాగార్జున
– ఫైర్ స్టేషన్ శిబిరానికి స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం అభినందనీయమని తాండూరు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నాగార్జున అన్నారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఫైర్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వైద్య సిబ్బంది సహాయంతో నిర్వహించిన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. ఫైర్ ఆఫీసర్ నాగార్జునతో పాటు సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. శిబిరంలో మొత్తం 35 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ నాగార్జున మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. అందరు రక్తదానానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్తనిధి కేంద్ర వైద్య సిబ్బందితో పాటు సిబ్బంది గోపాల్, జలంధర్, ఎండీ ఖాజ, అమర్ నాథ్ రెడ్డి, సునీల్ కుమార్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

