అవినీతి సైట్ ఇంజనీర్..!
– రూ. 5వేలు లంచం తీసుకుని దొరికాడు
– అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
– వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్ లంచావతారం బట్టబయలు అయ్యింది. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటన మంగళవారం కలెక్టరేట్‌లో కలకలం రేపింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ విభాగంలో ఇర్ఫాన్ అనే ఉద్యోగి సైట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా నవాబ్ పేట్ మండలం మాదారం గ్రామానికి చెందిన ప్రభు సివిల్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పలు స్కూళ్లలో పనులు చేశారు. ఈ పనుల బిల్లుల చెల్లింపు విషయంలో సైట్ ఇంజనీర్ ఇర్ఫాన్ లంచం డిమాండ్ చేశారు.
అయితే ప్రభు ఇందుకు అంగీకరించి గతంలో రూ. 51 వేలు ఇచ్చాడు. ఇంకా మిగతా పనుల కోసం ఇంజనీర్ ఇర్ఫాన్ మరో రూ. 5వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ప్రభు అవినీతి శాఖ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు అధికారులు పక్కా ప్లాన్ వేశారు. ఈ క్రమంలో సైట్ ఇంజనీర్ ఇర్ఫాన్ రూ. 5వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వెంటనే అధికారులు సైట్ ఇంజనీర్ ను అదుపులోకి తీసుకుని లంచంగా తీసుకున్న డబ్బులను స్వాదీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కస్టడికి తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలిస్తామని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికార యంత్రాంగంలో కలకలం రేపింది.

