కల్తీ ఐస్ క్రీమ్‌ షాపులపై కొరడా

ఆరోగ్యం క్రైం తాండూరు వికారాబాద్

కల్తీ ఐస్ క్రీమ్‌ షాపులపై కొరడా
– కెమికల్స్ మిక్సింగ్ గుట్టు రట్టు
– రూ. 29లక్షల రసాయసాల స్వాదీనం
– 6 షాపు యజమానులపై కేసు
– వెల్లడించిన వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: చిన్నారులు, ప్రజల ఆరోగ్యంపై చెలగాటం ఆడుతున్న ఐస్ క్రీమ్‌ షాపులపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపించారు. నిబంధనలకు విరుద్దంగా కెమికల్స్ మిక్సింగ్ చేస్తున్న వ్యాపారుల గుట్టు రట్టు చేయడం జరిగిందని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ వెల్లడించారు. జిల్లాలో 6 షాపులపై తనిఖీలు నిర్వహించి యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి మంగళవారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లో వేసవి వ్యాపారంగా ఉన్న ఐస్‌ క్రీమ్ విక్రయాలలో అక్రమాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ కోటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని మణికంఠ ఐస్‌ క్రీం ఫ్యాక్టరీ, ఎన్నెపల్లి చౌరస్తాలోని ఏకే ఐస్‌ క్రీమ్ ఫ్యాక్టరీ, పరిగిలోని మహా ఐస్‌ క్రీం, శ్రీ దుర్గ ఐస్‌ క్రీం, తాండూరులోని సోనూగీత ఐస్‌ క్రీమ్ ఫ్యాక్టరీ, రాయల్ ఐస్‌ క్రీం ఫ్యాక్టరీలలో తనిఖీలు చేయగా అక్కడ శివం అనే కెమికల్స్‌తో పాటు కలర్స్‌, ఇతర ప్రోడక్స్ట్‌ కలుపుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఏకే ఐస్‌ క్రీం, మహా ఐస్ క్రీం అనుమతులు లేకుండా షాపులు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. ఆయా షాపుల నుంచి రూ. 29 లక్షల విలువైన కెమికల్స్‌, కలర్స్‌, ఇతర ఫ్రోడక్ట్‌లను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు వికారాబాద్‌ మణికంట ఐస్‌ క్రీం షాపు యజమాని అరువ రామకృష్ణ, ఏకే ఐస్‌ క్రీం షాపు యజమాని అవేష్‌ ఖాన్, మహా ఐస్‌ క్రీం షాపు యజమాని కమర్తి రమేష్‌, శ్రీ దుర్గ ఐస్‌ క్రీం షాపు యజమాని కావలి శ్రీకాంత్, సోను గీత ఐస్‌ క్రీం షాపు యజమాని ఎండి అఫ్సర్, రాయల్ ఐస్‌ క్రీమ్ షాపు యజమాని ఎండీ వాహీద్‌లపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు
వేసవిలో ప్రజల ఆశలు, అవసరాలను ఆసరాగా చేసుకుని చెలగాటం ఆడితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. ఐస్‌ క్రీంలలో హానికరమైన కెమికల్స్‌ను మిక్సింగ్ చేయడం నేరమన్నారు. ప్రజలు కూడ ఐస్‌ క్రీం, ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో, ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఇలాంటి కల్తీ ఆహారాల తయారీ, విక్రయాలకు పాల్పడితే పోలీసులకు లేదా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు సమచారం అందించాలని సూచించారు.