కాలుష్య కర్మాగారానికి లాక్..!
– జిప్సం ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు
– ఫలించిన గుంతబాస్పల్లి సర్పంచ్, గ్రామస్తుల పోరాటం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన తాండూరు మండలం గుంతబాస్పల్లిలోని జిప్సం కర్మాగారానికి అధికారులు లాక్ చేశారు. తాళం పడింది. గురువారం కాలుష్య నియంత్రణ. రెవెన్యూ అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేశారు. గ్రామ శివారులో కొనసాగుతున్న ఇండస్ కెమికల్ ఫ్యాక్టరీ(జిప్సం కర్మాగారం) కాలుష్యంపై గ్రామ సర్పంచ్ జగదీష్, గ్రామస్తులు పోరాటం. చేస్తున్నారు. కర్మాగారం నుంచి వెలువడే విష వాయువుతో గాలి, నీరు, భూమి కాలుష్యం జరుగుతున్నాయని ఆందోళన కూడా చేపట్టారు. కర్మాగారాన్ని మూసి వేయాలని గేటు ముందు బైటాయించి నిరసనలు తెలిపారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ కాలుష్య నియంత్రణ అధికారులు, మానవ హక్కుల సంఘం అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఈఫిర్యాదులకు స్పందించిన కాలుష్య నియంత్రణ అధికారులు గత ఫిబ్రవరిలో తనిఖీలు చేశారు. గత మార్చిలో కర్మాగారంను సీజ్ చేయాలని, ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కూడా కర్మాగారం ప్రతినిధులు మూసి వేయకుండా కొనసాగించడంతో కరణ్ కోట్ పోలీసులకు, తాండూరు తహసీల్దార్, జిల్లా కలెక్టర్, అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కర్మాగారాన్ని మూసి వేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం తాండూరు రెవెన్యూ ఇనుస్పెక్టర్ బాలరాజ్ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఇంజనీర్ సిద్దార్థతో కలిసి జిప్సం కర్మాగారాన్ని సందర్శించారు.

కర్మాగారం నిర్వహణను పరిశీలించి సీజ్ చేశారు. అధికారులు ఫ్యాక్టరీకి తాళం వేశారు. దీంతో గ్రామ సర్పంచ్ జగదీష్, గ్రామస్తులు చేసిన పోరాటం ఫలించింది. కర్మాగారం మూత పడడంతో సర్పంచ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ కర్మాగారం శాశ్వితంగా తెరుచుకోకుండా చూడాలని కోరారు.

