ప్రజల వద్దకే ఆర్టీసీ..!
– ఊరికో ప్రత్యేక ఆఫీసర్
– మున్సిపల్ వార్డుల్లో కూడ
– కొత్త శ్రీకారం దేనికోసమంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించడం కోసం తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎన్నో కీలక నిర్ణాయాలను తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయంతో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతంది. ఆర్టీసీని ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తోన్న వివిధ కార్యక్రమాలను వివరించి.. టీఎస్‌ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థగా నామకరణం చేస్తోంది. గ్రామాల్లో నివాసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లగా డిపో మేనేజర్లు నియమిస్తారు. ఇక హైదరాబాద్ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పనిచేస్తారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో సంబంధిత విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను స్థానిక డిపో మేనేజర్ పొందుపరుస్తారు. అందులో బస్ ఆఫీసర్ పేరు, ఫోన్ నంబర్ ఉంటుంది. ‘మీ గ్రామానికి వచ్చే బస్సులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, రాయితీ పథకాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు తీసుకోవడానికి విలేజ్ బస్ ఆఫీసర్‌ను సంప్రదించండి’ అని అందులో రాస్తారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో పాటు పంక్షన్ హాల్స్ నిర్వాహకులను బస్ ఆఫీసర్లు సంప్రదిస్తారు. వారికి తమ సెల్‌ఫోన్ నంబర్లను అందజేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు టీఎస్‌ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు.
వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే..?
విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామస్థులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను వారు సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్ ట్రిప్పులను పెంచుతారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని వివరిస్తారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే జరిగే అనర్థాలను ప్రజలకు చెప్తారు.
వచ్చే నెల నుంచే అమలు
విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ గారు జారీ చేశారు. నియామకాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు బస్ ఆఫీసర్‌గా ఉంటారు. చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని నియమిస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు వీల్లేదు. బస్ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బస్ ఆఫీసర్ల వ్యవస్థ మే ఒకటో తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

