పేదల కంటిచూపుకు ప్రాధాన్యం
– కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
– సంగెంకలాన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగుతో పేదల కంటి చూపుకు ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు, సంగెం కలాన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారు పేదల అభివృద్ధి. సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్రంలో వృద్దులతో పాటు అందరిలో అంధత్వ నియంత్రణ కోసం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిందన్నారు.
ఉద్యమంలా కొనసాగుతున్న కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలతో పాటు మందులను అందజేయడం జరుగుతుందన్నారు. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, కంటి వైద్య శిబిరం వైద్యులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

