ఎమ్మెల్యేకు అప్రతిష్ట తెస్తున్నారు
– మార్కెట్ కమిటి చైర్మన్‌వి చౌకబారు విమర్శలు
– స్థాయి మరిచి సొంతపార్టీపై విమర్శలు అసమంజసం
– డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ ఎస్.రవీందర్‌గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వెంట ఉన్న అనుచరుల చౌకబారు రాజకీయాలతో ఆయనకు అప్రతిష్ట తీసుకవస్తున్నారని డీసీసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డైరెక్టర్, తాండూరు మండలం ఎల్మకన్నె సహాకార సంఘం చైర్మన్ సంగెం నారాయణగౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో రవీందర్ గౌడ్ నావంద్గీ పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, యాలాల మండల పార్టీ అధ్యక్షులు సిద్రాల శ్రీనివాస్, బషీరాబాద్ మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తాండూరు, యాలాల మండల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కారణంగానే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని గుర్తుచేశారు. కాని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, రైతు సమితి కన్వినర్ రాంలింగారెడ్డిలు తనపై, వెంకట్రామ్ రెడ్డిలపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మంచిపద్దతి కాదన్నారు. ఒకే పార్టీలో ఉంటూ సొంత పార్టీ నాయకులపై వాఖ్యలు చేయడం అసమంజసమన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనకేమి చేయలేదని పేర్కొంటూ విఠల్ నాయక్ ఎమ్మెల్యే కాళ్ల వద్దకు చేరుకున్నారని అన్నారు. ఆయన చైర్మన్ పదవిని పొడగిస్తారనే ఉద్దేశంతో చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి విమర్శల వల్ల ఎమ్మెల్యే ప్రతిష్టను ఆయన వర్గీయులే దెబ్బతీస్తున్నారని అన్నారు. కానీ మేము ఎవ్వరి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం లేదన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అనుకూలంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాలతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ ప్రతిష్టలు దిగజారి పోతాయన్నారు. అలాంటి వారికి వదిలించుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. మరోవైపు ఆయా మండలాల నాయకులు మాట్లాడుతూ మార్కెట్ కమిటి చైర్మన్ హోదాలో ఉన్న విఠల్ నాయక్ బ్రోకర్ రాజకీయాలు అంటూ చేసిన విమర్శలు అయనకే వర్తిస్తాయన్నారు. ఎమ్మెల్సీపై, పార్టీ కార్యక్తలపై చేసిన విమర్శలకు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, ఎంపీటీసీ వసంత్ కుమార్, సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, యాలాల మండల నాయకులు బుడిగ జంగం యాదప్ప, బషీరాబాద్ మండల నాయకులు బన్సిలాల్, నర్సింలు, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
