ప్రజా సేవకు ప్రాధాన్యం..!
– పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు
– అన్నదానం, ఆరోగ్య శిబిరాలు, బాడీ బిల్డింగ్ పోటీలు
– వచ్చే నెల నుంచి పామూహిక వివాహాలు
– సెప్టంబర్ లో వికలాంగులకు త్రీవీలర్స్ పంపిణీ
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజాసేవకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా తాండూరు నియోజకవర్గ స్థాయిలో నిరంతర సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే క్రికెట్ పోటీలు నిర్వహించి ట్రోఫీ, నగదును అందించడం జరిగిందని గుర్తుచేశారు. ఈ జులైతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రేపటి నుంచి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. రోగులతో పాటు బంధువులకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు.
తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో కస్టర్ల వారిగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ప్రతి క్లస్టర్లో వారం రోజులు శిబిరాలు జరుగుతాయన్నారు. పీఎంఆర్, బీవీజీ ఫౌండేషన్ ద్వారా యువతను భాగస్వామ్యం చేసుకుని సేవలను అందిస్తామన్నారు. ఆగస్టు 30వ తేది, సెసెప్టెంబర్ 1వ తేది, 3వ తేదీలలో నియోజకవర్గ స్థాయిలో సామూహిక వివాహాలు జరిపించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 10వ తేదిన యువతను ప్రోత్సహించేందుకు బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని వికలాంగులకు, మహిళ వికలాంగులకు గుర్తించి అందరికి త్రీ వీలర్స్ మోటార్ సైకిళ్లు అందించడం జరుగుతుందన్నారు. వికలాంగులను ఆధార్ కార్డు, వికలాంగ సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తించి అందిస్తామన్నారు. దీంతోపాటు హైస్కూల్ స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. యువనాయకులు పట్నం రినీష్ రెడ్డి చేతుల మీదుగా సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. ట్రస్ట్ సేవలకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సామూహిక వివాహాల కోసం, త్రీవీలర్స్ పొందడం కోసం, ఆరోగ్య శిబిరాలు, బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ట్రస్టును సంప్రదించాలన్నారు. సేవా కార్యక్రమానలు, పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డాక్టర్ సంపత్ కుమార్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ అబ్దుల్ రజాక్, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, మన్మోహన్ సార్డా, బోయరాజు, ఇందూరు ప్రకాష్, తంబాకు చంద్రశేఖర్, బిర్కడ్ రఘు, రొంపల్లి సంతోష్ కుమార్, దత్తు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


