పంజాబ్ సీఎం రేసులో ఆ ఐదుగురు

జాతీయం రాజకీయం

పంజాబ్ సీఎం రేసులో ఆ ఐదుగురు
– అంబికాసోని పేరును ప్ర‌తిపాధించిన రాహుల్
– ఎంపిక‌పై రంగంలోకి సోనియా గాంధీ
ద‌ర్శిని బ్యూరో: పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో అక్క‌డి రాజకీయాలు రంజుగా మారాయి. పంబాజ్ తదుపరి సీఎం ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం ప‌ద‌వికోసం ఐదుగురు నాయ‌కులు పోటీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాకర్, ప్రస్తుత పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ, మంత్రి సుఖ్జీందర్ సింగ్, త్రిప్త్ రాజిందర్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా పంజాబ్ సీఎం పదవిని అంబికా సోనీ చేపట్టాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను అంబికా సోని తిరస్కరించినట్లు తెలుస్తోంది. పంజాబ్ సీఎంగా సిక్కు వ్యక్తినే నియమించాలని పార్టీ అధిష్టానానికి సూచిస్తూ.. ఆమె సీఎం పదవిని తిరస్కరించారన్న టాక్ వినిపిస్తోంది. సిక్కు వ్యక్తి సీఎంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందని ఆమె రాహుల్ గాంధీకి స్పష్టంచేసినట్లు సమాచారం.

కొత్త సీఎంగా ఎవరిని నియమించాలన్న విషయంలో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టాన పరిశీలకులు హరీష్ రావత్, అజయ్ మకేన్ తెలుసుకుంటున్నారు. ఇప్పటికే వారు ఈ పని మొదలుపెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలతో శనివారం వారు సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో రంగంలోకి సోనియాగాంధీ దిగి కొత్త సీఎం పదవి రేసులో కొత్త ముఖ్యమంత్రి పేరును ఆదివారంనాడు రాత్రికల్లా ఖరారు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది.