టిక్కెట్టు తుఫాన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

టిక్కెట్టు తుఫాన్..!
– అధిష్టానం పైలెట్‌ వైపే..?
– పట్నంకు మంత్రి పదవి ఆఫర్
– మహేంద్రుడి మౌనంపై డైలమా
– రెండు రోజుల్లో తేలనున్న నిర్ణయం
– హీటెక్కుతున్న తాండూరు రాజకీయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచే పట్నం, పైలెట్‌ల మద్య టిక్కెట్టు తుఫాన్ రసదాయకంగా మారింది. ఎందుకంటే తాండూరు టిక్కెట్టును పైలెట్‌కే ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇదే స్థానంపై గురిపెట్టిన పట్నంకు మంత్రి పదవితో పాటు రాజ్యసభ పదవిని ఆఫర్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరిష్‌ రావు, చేవేళ్ల ఎంపి రంజిత్‌ రెడ్డి సమక్షంలో మహేందర్‌ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో తాండూరునుంచే పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి టిక్కెట్టు రాకుంటే కాంగ్రెస్‌లో చేరుతారని, అక్కడి నుంచే పోటీ చేయడం ఖాయమనే ఊహాగానాలు సైతం స్ట్రాంగ్‌గా షికార్లు చేశాయి.

చివరి నిమిషం వరకు బీఆర్ఎస్‌లో ఉండి టిక్కెట్టు సాధించుకుందామని మహేందర్ రెడ్డి భావించారు. కాని సమయం దగ్గరపడడంతో అధిష్టానం మహేందర్ రెడ్డికి కాదని పైలెట్ రోహిత్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చే పరిణామాలు ఏర్పడ్డాయి. గతంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్టు ఇస్తామని చెప్పినట్లు, వారిని కాదని వేరే వాళ్లకు టిక్కెట్టు ఇచ్చే చాన్స్‌ లేదని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ లెక్కన పైలెట్ రోహిత్ రెడ్డికే పార్టీ టిక్కెట్టు ఖాయమన్నట్లు తెలుస్తోంది. అయితే మహేందర్ రెడ్డిని పార్టీ నుంచి వీడిపోకుండా చూసేందుకు అధిష్టానం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే మంత్రి హరీష్ రావు, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపి రంజిత్ రెడ్డి మహేందర్‌ రెడ్డికే టిక్కెట్టు ఇవ్వాలని మద్దతు ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

చివరకు పైలెట్‌కే అవకాశం కల్పిస్తుండడంతో మహేందర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తరువాత మంత్రి పదవి, రాజ్యసభ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మహేందర్ రెడ్డి మాత్రం సమయం కోరినట్లు సమాచారం. మరోవైపు మహేందర్ రెడ్డి టిక్కెట్టు విషయంతో పాటు పార్టీ మారే విషయంలో మౌనంగా ఉండడం పట్ల తాండూరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలోని నేతలు, కార్యకర్తలు డైలామాలో పడ్డారు. ఏ సంగతి తేల్చాలని మహేందర్ రెడ్డికి ఫోన్‌లు చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే మహేందర్ రెడ్డి రానున్న రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని, ఇందుకోసం కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు ఆయన వర్గం నేతలు అంటున్నారు. ఏదేమైనా మహేందర్ రెడ్డి తాండూరు నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన వర్గం నేతలు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!