బషీరాబాద్‌లో గవర్నమెంట్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– ఫలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రయత్నం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మండలంకు కొత్తగా ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యాశాఖ బషీరాబాద్ కు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాండూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బషీరాబాద్ మండలం కర్ణాటక రాష్ర్ట సరిహద్దులో ఉంటుంది. తాండూరును విద్యా రంగంలో ముందుంచేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బషీరాబాద్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించి విజయం సాధించారు. బషీరాబాద్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు దశాబ్దాలుగా పాలకులను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై బషీరాబాద్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు స్థానికంగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీ అందుబాటులోకి రానుంది. అడిగిన వెంటనే బషీరాబాద్ కు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంజూరు కు సహకరించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి…

