దుర్వినియోగంపై అడిగితే దుష్ప్రచారం
– బురద జల్లేందుకు కొన్ని శక్తుల కుట్ర
– మా భర్త ఎవ్వరిని వేధించలే.. బెధిరించలేదు
– మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్‌లో నిధుల దుర్వినియోగంను బయటపెడతామనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం రాత్రి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన భర్త టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పరిమళ్ గుప్తతో కలిసి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ శానిటరీ ఇసుస్పెక్టర్ శ్యాంసుందర్ తన భర్తపై చేసిన ఆరోపణలు అర్దరహితమని కొట్టిపారేశారు. నిజానికి పట్టణంలోని 12వ వార్డులో చేపట్టే పనికోసం జీసీబీ ఇవ్వాలని శానిటరీ ఇనుస్పెక్టర్‌ను కోరగా అందులో డీజీల్ లేదని చెప్పడంతో ఊరుకున్నారని తెలిపారు. డీజీల్ వినియోగంలో నిధుల దుర్వినియోగంపై పత్రికల్లో రావడంతో ఎక్కడ ప్రశ్నిస్తారనే భావించి తమపై దుష్ప్రచారానికి పూనుకున్నారని విమర్శించారు. గతంలో రూ. 2లక్షలు దాటని బిల్లులు తాజాగా రూ. 4 లక్షల వరకు ఎలా పెరుగుతున్నాయనే తెలుసుకోవాలన్నారు.
ఈ విషయంపై అడిగితే ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎనాడు తన భర్త మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల విషయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ఇలాంటి వ్యవహారాలలో ఇరికించి తాండూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మున్సిపల్‌లో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేపడుతుంటే ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ స్పందించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పలు విధాలుగా తమను వేధించేందు కొన్ని శక్తులు కంకణం కట్టుకున్నాయని… అధికారులు, ప్రతిపక్ష నాయకులతో వెనుక నుండి నడిపిస్తున్నారని ఆరోపించారు.
కమీషనర్ లేక భయం లేకుండా పోయింది
గత 9 నెలలుగా మున్సిపల్‌లో ఇంచార్జ్ కమీషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ రెవెన్యూ విభాగంకు చెందడం పట్ల మున్సిపల్ కార్యాలయంలో పరిపాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు. పూర్తిస్థాయి కమీషనర్ లేక అధికారులు, సిబ్బందికి భయం లేకుండా పోయిందన్నారు. ఇటీవల మున్సిపల్‌ను తనిఖీ చేసిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వాన్న మున్సిపాల్టీగా తయారైందని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా మున్సిపల్‌కు కొత్త కమీషనర్‌ను నియమించేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.
ఎవ్వరిని బెధిరించలేదు : పరిమళ్ గుప్త
మున్సిపల్ ఉద్యోగులను గానీ, సిబ్బందిని గానీ ఎవ్వరిని వేధించడం.. బెధిరించడం చేయలేదని టీఆర్ఎస్ నాయకులు పరిమళ్ గుప్త అన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలను అనువుగా చేసుకుని ప్రతిపక్షాలు అధికారులతో కుట్రలు చేస్తున్నాయని అన్నారు. దీనిని అసరా చేసుకుని ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు.