కీచక తాత..!
– మూగ, మైనర్ బాలికపై అత్యాచారయత్నం
– చాక్లెట్, డబ్బులిస్తానని దుశ్చర్య
– పెద్దేముల్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నీకు డబ్బులు ఇస్తా, మంచి చాక్లెట్ ఇస్తానని చెప్పి 60 ఏండ్ల వృద్దుడు వరుసకు మనుమరాలు అయ్యే 13 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మూగ, మానసిక వికలాంగురాలు అని తెలిసీ అఘాయిత్యానికి పాల్పడిన కీచక తాత సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది.
పెద్దేముల్ ఎస్ఐ కాశినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తట్టెపల్లికి చెందిన ఓ కుటుంబం వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. వారికి 13 బాలిక, కుమారుడు ఉన్నారు. బాలిక మూగ, మానసిక వికలాంగురాలు. తల్లిదండ్రులు రోజూ బాలికను ఇంటి వద్దే వదిలి పొలం పనులకు వెళుతుంటారు. గురువారం కూడా బాలికను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. బాలికను అదే గ్రామానికి చెందిన వరుసకు తాత అయిన వృద్ధుడు నీకు డబ్బులు ఇస్తా, చాక్లెట్లు ఇస్తా రా వెంట ఇంటికి తీసుకెళ్లాడు.
అయితే అదేరోజు బాలిక తమ్ముడు జ్వరం ఉందని ఇంటివద్దే ఉన్నాడు. కొద్ది సేపటి తరువాత అక్క కనిపించడం లేదని గ్రామంలో ఆరా తీస్తుండగా ఓ వ్యక్తి మీ తాత ఇంటికి వెళ్లిందని చెప్పారు. తమ్ముడు తాత ఇంటికి వెళ్లి అక్క ఎక్కడా అని అడిగాడు. ఇందుకు తాత ఇక్కడికి రాలేదని బుకాయించాడు. అంతలోనే బాలిక ఏడుస్తూ బయటకు వచ్చింది. వెంటనే తమ్ముడు అక్కకు ఏదో జరిగిందని విషయాన్ని ఫోన్లో తల్లికి చెప్పాడు.
ఇంటికి వచ్చిన తల్లి బాలికను అడడగా జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే అత్యాచారాయత్నానికి పాల్పడిన తాత పరారయ్యాడు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కాశినాథ్ తెలిపారు.
ఇది కూడా చదవండి..

