బీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ కట్టబెట్టాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ కట్టబెట్టాలి
– 45 రోజులు నాకిస్తే.. ఐదేళ్లు మీకిస్తా
– యువత తలుచుకుంటే సాధించలేదని ఏమిలేదు
– హస్తాన్ని భస్మం చేసి చూపిస్తా
– యూత్ వింగ్ మీటింగ్‌లో పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో నియోజకవర్గంలోని యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 45 రోజులు చాలా కీలకమన్నారు.

యువలందరూ బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలన్నారు. 45 రోజులు నాకోసం, సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తే వచ్చే ఐదేళ్లు మీకోసం పనిచేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, అసరా, రైతు బందు, రైతు బీమా, గృహలక్ష్మీ, దళితబందు, బీసీ బందు, మైనార్టీలకు సాయం వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం యువకులు సైనికుల్లా పనిచేయాలన్నారు.
యువకులు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదని, భారీ మెజార్టీ అందించేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా నన్ను నమ్ముకుని గెలిపించిన యువకులను, తాండూరు ప్రజలను మోసం చేయలేక కుట్ర పన్నిన బీజేపీ ప్రతినిధులను జైలుకు పంపించానని పాంహౌజ్ కుట్రను గుర్తుచేశారు. తాండూరు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎప్పటికి అమ్ముడు పోనని అన్నారు.

అదేవిధంగా యువకులు, ప్రజలు నావెంట అండగా ఉంటే హస్తంను భస్మం చేస్తానని అన్నారు. అంతకుముందు పలువురు యువకులు పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, శ్రీశైల్ రెడ్డి, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

మోగిన ఎలక్షన్ నగారా..!