తాండూరులోనే ఉంటా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులోనే ఉంటా..!
– అభివృద్ధి పూర్తికి సహకరిస్తాం
– ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేయాలి
– ప్రజాతీర్పులో స్వల్ప మెజార్టీతోనే ఓటమి
– వదంతులు, పుకార్లను నమ్మొద్దు
– తాండూరు తాజా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నాది.. చివరి రక్తపు బొట్టు వరకు తాండూరులో ఉంటానని తాజా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిందని, అందులో భాగంగా తాండూరులో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అన్నారు. అయినా కూడా దానిని తట్టుకున్నామని, తనకు 78 వేల పైలుకు ఓట్లు వచ్చాయంటే తాండూరు ప్రజల ఆశీర్వాదాలు తనపై ఉన్నాయని దీమా వ్యక్తం చేశారు. తమలోని లోపాలను, నిర్లక్ష్యాన్ని సవరించుకుంటామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

తాండూరులో ప్రారంభించిన పనులన్ని పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకారం అందిస్తామని అన్నారు. ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజల తరుపున ఉండి పోరాటం చేస్తామన్నారు.. అదేవిధంగా తాను తాండూరులో నివాసాన్ని అమ్ముకున్నానని. తాండూరు వదిలి వెళుతున్నట్లు కొందరు పుకార్లు, వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వాటిని ఎవ్వరు నమ్మొద్దని సూచించారు. తాండూరు నాది.. చివరి రక్తపు బొట్టు వరకు తాండూరులో ఉంటానని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలు ఎవ్వరు ఆధైర్య పడాల్సిన పనిలేదని, కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ జుబేర్ లాల, నాయకులు బషరత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!