ఉపరాష్ట్ర ఎన్నికకు షెడ్యూల్ విడుదల
– జులై 17న నామినేషన్, ఆగస్టు 6న ఎన్నిక
దర్శిని డెస్క్: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విధి విధానాలను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా జులై 17 నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పించగా ఆగస్టు 6న (శనివారం) ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది.
షేడ్యూల్‌లోని ముఖ్య అంశాలు
* ఉప రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ – జులై 5, 2022
* నామినేషన్లకు చివరి తేదీ- జులై 19
* నామినేషన్ల పరిశీలన- జులై 20
* నామినేషన్ల ఉపసంహరణకు గడువు- జులై 22
* ఎన్నిక తేదీ- ఆగస్టు 6 (ఉదయం 10గంటలనుంచి సాయంత్రం 5గంటలవరకు)
* ఫలితం- పోలింగ్ ముగిసిన రోజే వెల్లడి కానుంది.
ఎన్నికల విధానం
ఉప రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకొని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓబీసీ, జనరల్ కేటగిరీకి చెందిన మహిళను బరిలోకి దించుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దక్షిణాది నుంచి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



