కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం

క్రైం తాండూరు వికారాబాద్

కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం
– పెద్దేముల్ మండలంలో వెలుగులోకి
– మృతుడు బషీరాబాద్ మండల వాసిగా గుర్తింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మంగళవారం పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఆత్కూర్ తాండా సమీపంలో మూతపడిన క్వారీ సమీపంలో కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కాశినాథ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలతో మృతుడు బషీరాబాద్‌ మండల వాసిగా గుర్తించారు.

మండలంలోని నావంద్గి గ్రామానికి చెందిన వడ్ల వీరేశంచారి(40)గా గుర్తించారు. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం వీరేశం చారి తలకు బలమైన గాయాలు కావడంతో మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి అటు ఇటూ తిరుగుతు ఉండేవాడు. ఈ క్రమంలో గత నెల సంక్రాంతి పండగ రోజు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంభీకులు బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మంగళవారం పెద్దేముల్ మండలం ఆత్కూర్ తాండా వద్ద లభించిన మృతదేహం వద్ద ఆధారాలతో మిస్సింగ్ కేసుకు పోల్చగా మృతదేహం వీరేశంగా నిర్దారించారు. కుటుంభీకులు కూడా మృత దేహాన్ని గుర్తించారు. స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మృతుడి అన్న శ్రీనివాస్ చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కాశినాథ్ వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!