నేరాల నియంత్రణకు సహకరించాలి
– వాహనదారులందరు రోడ్డు నిబంధనలు పాటించాలి
– మద్యం సేవించి వాహనాలు నడపరాదు : పట్టణ ఎస్ఐ గిరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని తాండూరు పట్టణ ఎస్ఐ గిరి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధి మండలంలోని అంతారం గ్రామంలో కమ్యూనిటీ పోలిసింగ్, ట్రాఫిక్ నిబంధనలు, డ్రంక్ డ్రైవ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ గిరి మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా అసాంఘీక కార్యక్రమాలు, అల్లర్లు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతోందన్నారు.
అదేవిధంగా వాహనదారులందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
