నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి
– ప్రభుత్వం దృష్టిసారిస్తే పరిశ్రమకు మనుగడ
– రాయల్టీ, లీజు ఫీజులను తగ్గిస్తే ప్రయోజకరం
– అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన అభినందనీయం
– హర్షం వ్యక్తం చేసిన క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని నాపరాతి పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. శనివారం తాండూరు పట్టణంలోని స్టోన్ భవన్ లో క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు ఓంప్రకాష్ సోమాని, ప్రధాన కార్యదర్శి జుబేర్ లాలలు మీడియాతో మాట్లాడారు. తాండూరులోని నాపరాతి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. నాపరాతి పరిశ్రమ ద్వారా స్థానికంగా దాదాపు 20వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని అన్నారు. అయితే నాపరాతిపై రాయల్టీ, సిగ్నియోరేజ్ ఫీజులు పెంచడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

తాండూరు సరిహద్దులోని పక్క రాష్ట్రం కర్ణాటకలో రాయల్టీ ఫీజు రూ.800లు ఉండగా ఇక్కడ గతంలో రూ. 1100లు ఉంటే రూ. 2850లకు పెంచడంతో రాయల్టీ పెంచారని గుర్తు చేశారు. అదేవిధంగా ఒక లీజు పొందాలంటే రూ. 18లక్షల ఖర్చు అవుతుందని, దానిని మరోకరిపైకి మార్చాలంటే.. సుమారు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాపరాతి పరిశ్రమ మొత్తం కర్ణాటకకు తరలించే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో నాపరాతి సమస్యలపై ప్రస్తావించడం శుభపరిణామన్నారు. సీఎం రేంత్ రెడ్డి జిల్లా, స్పీకర్ సొంత పుట్టిన ప్రాంతమని జోడిస్తూ సమస్యలను వివరించడం హర్షణీయమన్నారు.

నాపరాతి పరిశ్రమలో రాయల్టీ, ఫీజు విషయంలో తగ్గింపు చేయాలని గత ప్రభుత్వాలకు వి స్నవించడం జరిగిందన్నారు. తాజాగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో సమస్యలపై ప్రస్తావించడంపై కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మళ్లీ వివరిస్తామన్నారు. నాపరాతి పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం దృష్టిసారిస్తే మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం రాయల్టీ, లీజు ఫీజులను తగ్గించాలని కోరారు. అదేవిధంగా గ్రానేట్ పై ఉన్న 40 శాతం రాయితీని మరో రెండేళ్లు పొడగించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారంపై సీఎం రెవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై నమ్మకముందన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో నాపరాతి పరిశ్రమను ఏడాదిలోగా పారిశ్రామిక వాడలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన సహాకారంతో తాండూరులోని దాదాపు 500 యూనిట్లను పారిశ్రామిక వాడకు తరలిస్తామన్నారు. అదేవి ధంగా అక్కడ నైపుణ్య తరగతలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్వర్ అహమద్, జాయింట్ సెక్రటరీ తలారీ నర్సింలు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సయ్యద్ హబీబ్ లాల తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!