అందరి దృష్టి హస్తం వైపే..!
– అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కించేది కాంగ్రెస్సే
– చేతి చేరికలతో తెలంగాణ పునర్ నిర్మాణం
– హామిలు అమలు చేయని బీజేపీ
– కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి
– కొండా సవాల్ స్వీకరించే పోటీ చేస్తున్నా
– చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
– ఎంపీ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీ అందించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలతో కాంగ్రెస్ పార్టీపై అందరి దృష్టి ఏర్పడిందని, రానున్న కాలమంతా హస్తందే అని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గంలోని క్లాసిక్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు పాలించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. 38వేల కోట్ల కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉంచిందన్నారు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు ఒంటరిగా పోరాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీ నుంచి నేతలు చేరే స్థాయికి తీసుకవచ్చిందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో చేరికలు ఉపయోగపడతాయన్నారు. ఇందులో భాగంగా మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. చేవేళ్లతో పాటు సీఎం ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్ గిరిలో వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిలను నిలబెట్టారని. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రభుత్వ పథకాలలో అందరికి భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు.
తాండూరుకు మంజూరైన 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో కమిటి సభ్యులుగా అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. బీజేపీ పాలనతో పార్లమెంట్ స్థానానికి, జిల్లాకు ఒరిగిందేమి లేదన్నారు. ఆ పార్టీ హంగు ఆర్భాటాలే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా అన్ని ప్రాంతాల్లో ఆదరించిన ప్రజల కోసం పనిచేయడం జరిగిందన్నారు. గతంలో ఉన్న ఎంపీ కొండా చేసిందేమి లేదన్నారు. అపోలో ఆసుపత్రిలో ఏ పార్టీ మనిషి అని తెలుసుకుని సేవలందిస్తారని విమర్శించారు. మోడీ పేరు తీసుకోకుండా పనిచేస్తానని, రాహుల్ గాంధీ పేరు లేకుండా పనిచేసేందుకు సిద్ధమా అని కొండా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గతంలో తాండూరులోని పరిస్థితుల కారణంగా సమయం కేటాయించలేదని, ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో అధిక సమయం కేటాయిస్తానని అన్నారు.
అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కోడ్ తరువాత ఐటీఐ కాలేజీతో పాటు అన్ని హామిలను అమలు చేస్తామన్నారు. చేవేళ్ల ఎన్నికల్లో ఎంపీ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మురళీకృష్ణ గౌడ్, డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మక్సూద్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, బోయరవి, రాము, జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, మాజీ కౌన్సిలర్ పరిమళ, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహరాజ్, మాజీ ఎంపీ – శరణు బసప్ప, కరణ్ కోట్ ఎంపీటీసీ రాజ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగప్ప, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

