బీఆర్ఎస్ నేతలకు జైలు ఖాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ నేతలకు జైలు ఖాయం
– తాండూరులో పార్టీ అభ్యర్థిని ఓడించాలి
– బీజేపీకి పోటీ దక్కకపోవడం విచారకరం
– చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు భవిష్యత్తులో జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నాయకులు, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు చేశారు. శనివారం తాండూరుకు వచ్చిన ఆయన పట్టణంలోని బీజేపీ పట్టణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారినా ఇంకా బాప్, బేటా, బేటీ, బాంజా పార్టీ లాగానే ఉందన్నారు. తెలంగాణ కోసం వచ్చిన బీఆర్ఎస్ పార్టీ దోచుకునేందుకు సిద్దమయ్యిందన్నారు. ఈ పార్టీలో ఉంటూ అక్రమాలకు పాల్పడిన నేతలు జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యమన్నారు.

తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం దక్కకపోవడం విచారకరమన్నారు. పార్టీ ఆదేశిస్తేనే జనసేనకు మద్దతు ఇస్తామన్నారు. పార్టికి టిక్కెట్టు దక్కకపోయినా నేతలు ఇతర పార్టీలకు వెళ్లకపోవడం అభినందనీయమన్నారు. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. అదేవిధంగా తాను బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీకి సిద్దాంతాలు లేవని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, నాయకులు నరేష్ మహరాజ్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బాలప్ప, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, వివిధ మండలాల నాయకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..