కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన
– బీఆర్ఎస్ తో తెలంగాణ ఆదర్శం
– పార్టీ మారినోళ్లకు గడ్డుకాలం తప్పదు
– రేవంత్ సర్కారులో రైతులు, నిరుద్యోగుల గోస
– 13న చలో చేవేళ్ల జయప్రదం చేద్దాం
– మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోస పూరిత పాలన చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ లు అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనను అందరు గమనిస్తున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీ హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చేసిందేమీ లేదన్నారు. రైతులకు, నిరుద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన హామిలను విస్మరించడంతో అందరు గోస పడుతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ అధినేత రైతుల కోసం యాత్రలు చేస్తుంటే సీఎం రేవంత్ సర్కారు ఆయన్ని బద్నాం చేసే విధంగా కుట్రలు చేస్తుందన్నారు. కేసీఆర్ వెళ్లిన తరువాతే రైతులకు నీరందిస్తున్నారని అన్నారు. ఓ వైపు 10 ఏండ్లలో తెలంగాణ ఆదర్శంగా మారిందని రాహుల్ గాంధీ కితాబిస్తూ ఉదహరిస్తుంటే సీఎం రేవంత్ సర్కారు రైతులను, నిరుద్యోగులను, మహిళలను గోస పెడుతుందని దుయ్యబట్టారు. ఇంకా ప్రజలను మోసం చేసేందుకు అబద్దపు హామిలను ఇచ్చేందుకు సిద్ధపడిందన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకుండా పోయిందన్నారు. అధికారం చేపట్టడం కోసం మోసపూరిత హామిలను ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనను దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతుంటే తాండూరులో రోహిత్ రెడ్డిని దూరం చేసుకున్నందుకు ఇక్కడి ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. బీఆర్ఎస్ పై, రోహిత్ రెడ్డిపై ప్రజలు ఉన్న అభిమానం ఇంకా చెక్కు చెదరలేందన్నారు.

అదేవిధంగా చేవేళ్ల గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డాగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొండాను, రంజిత్ రెడ్డిలను గెలిపిస్తే చేవేళ్ల పార్లమెంటుకు వాళ్లు చేసిందేమి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి కొండాను. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డిలను చిత్తుగా ఓడించి తరిమేస్తామన్నారు. దీంతో పాటు పదవుల కోసం పార్టీలు మారిన నేతలకు గడ్డుకాలం తప్పదన్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపుకోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చె స్తుందన్నారు.

ఇందులో భాగంగా ఈనెల 13న చేవేళ్లలో చలో చేవేళ్ల సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న సభకు తాండూరు నియోజకవర్గం నుంచి 25వేల మందిని తరలించి బీఆర్ఎస్ సత్తా చాటుతామన్నారు. బీఆర్ఎస్ నుంచి లబ్దిపొందిన నేతలు, కార్యకర్తలు. లబ్దిదారులు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి. బషీరాబాద్ మండల అధ్యక్షులు సర్సిరెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పాండురంగా రెడ్డి, కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

హస్తంలో సముదాయ మంత్రం