కొత్త ఫించన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్..!
– నెలాఖరు వరకు ఆసరా దరఖాస్తుకు అవకాశం
– మీసేవా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్న ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి:దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త ఫించన్ లబ్దిదారులకు సర్కారు గుడ్ చెప్పింది. రాష్ట్రంలో 57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ పొందేందుకు మరోసారి దరఖాస్తులను స్వీకరించబోతోంది. ఇందుకోసం మీసేవా కేంద్రాలలో అవసరబైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేదని అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వారందరికీ పింఛన్లు అందుతాయని సీఎం కేసీఆర్ సభావేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించిన సీఎస్ సోమేష్ కుమార్. దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో రేపు 11వ తేది నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు లబ్దిదారులకు అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
అర్హులెవరంటే..
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులు. ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు. అలాగే దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్ తీసుకునేందుకు అనర్హులు.డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు ఆసరా పెన్షన్‌కు అనర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరా పెన్షన్లు ఇవ్వరు. తమ పేరిట హెవీ వెహికిల్స్ ఉన్నా, ఐటీ రిటర్నులు దాఖలు చేసినా పెన్షన్ పథకం వర్తంచదు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు. 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు కలిగిన వారికే పెన్షన్ ఇస్తారు. ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ రూ.2,116 వృద్ధాప్య పెన్షన్ అందజేస్తారు.