పండగలా బతుకమ్మ చీరల పంపిణీ
– ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా అందజేసిన చీరల పంపిణీని తాండూరులో పండగలా కొనసాగుతోంది. సోమవారం తాండూరు పట్టణంలోని 10, 11, 12, 7, 28వ వార్డులకు సంబంధించి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సీనియర్ మహిళ నాయకురాలు, కౌన్సిలర్ విజయదేవి, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్‌రెడ్డి, బంటు మల్లప్ప, కౌన్సిలర్ బాతుల మమతలు హాజరై మహిళలకు, యువతులకు చీరలను అందజేశారు.
మరోవైపు మున్సిపల్ పరిధి 14 వ వార్డులో ఎంఐఎం కౌన్సిలర్ బొంబీనా తన వార్డు పరిధిలోని రేషన్ దుకాణంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని చీరలను అందజేస్తుందని, ప్రజలు పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఆర్పీలు, నాయకులు బాతుల వెంకటయ్య, వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
