పారిశుద్ధ్యం, పవర్ సమస్యలు పరిష్కరించండి
– మున్సిపల్, విద్యుత్ ఆఫీసుల ముందు ఆందోళన
– నినాదాలతో నిరసన తెలిపిన బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్యం, పవర్ సమస్యలు పరిష్కరించాలంటూ తాండూరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్, విద్యుత్ కార్యాలయాల ముందు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం గేటు నుంచి బీజేపీ నేతలు దోమల తెరను ప్రదర్శిస్తూ కార్యాలయం ముందు వరకు చేరుకున్నారు. మెట్లపై బైటాయించి నిరసన తెలిపారు.
పట్టణంలో పారిశుద్ధ్యం తిష్ఠవేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కోటేశ్వర దేవాలయం వెళ్లే మార్గంలో, మంగలిగల్లి, పాత కూరగాయల మార్కెట్, బస్టాండ్ మార్గంలో, దొడ్డి కొమురయ్య విగ్రహం ఎదురుగా చెత్త కుప్పలు వెలుస్తున్నాయన్నారు. దోమలు. ఈగలు స్వైర విహారంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నాగారం నర్సింలు ఇంటి నుంచి మేయిన్ రోడ్డు మార్గం, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టు వరకు విద్యుత్ లైట్లు వెలగడం లేదని, నిర్వహణపై పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాగునీరు సరఫరా విషయంలో కూడా అశ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మద్య తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేశారు.
ఉచిత విద్యుత్ ను అమలు చేయాలి
మరోవైపు తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు కూడా బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు జీరో బిల్లులు మాత్రమే వసూలు చేయాలన్నారు. అదేవిధంగా దోబి వారికి గతంలో 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయడం జరిగిందని, ప్రస్తుతం వారి వద్ద కూడా కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఓ వైపు విద్యుత్ అంతరాయం కలిగితే నిలదీయమంటూనే విద్యుత్ కోతలను విధించడం సిగ్గుచేటన్నారు.
పట్టణంలో ఉచిత విద్యుత్ అమలుతో పాటు పవర్ సమస్యలు లేకుండా దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర నాయకురాలు అంతారం లలిత. జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ మల్లప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, మాజీ కార్యదర్శి దోమ కృష్ణ, నాయకులు రాజు, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

