బీసీల కులగణన చేపట్టాల్సిందే
– వికారాబాద్ జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి
– ఉద్యమ కారుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు
– రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం బీసీల కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్, తెలంగాణ ఉద్యమ కారుడు శుభప్రద్ పటేల్ అభిప్రాయ పడ్డారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి వచ్చిన ఆయన సీనీయర్ జర్నలిస్టు శెట్టి రవిశంకర్ నివాసంలో మీడీయాతో మాట్లాడారు. దేశంలో ప్రాణాలతో ఉన్న జంతువులకు లెక్కలు ఉన్నాయని, బీసీ కులాల లెక్కలు లేకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల మాదిరిగానే బీసీల కులగణన చేపట్టాలని 2016లోనే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. బీసీల కులగణనపై కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలపడంలేదన్నారు. రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరగాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా బీసీల కులగణన చేపట్టాల్సిందేనన్నారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాకారంతో తనవంతుగా కృషి చేస్తానని, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు బీసీ కులాల సంఘాలు ఉద్యమించాలన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమ కారులపై కేసుల ఎత్తివేతతో పాటు ఉద్యమ కారులకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు. అంతకుముందు టీఆర్ఎస్, టీజేఎస్, ఉద్యమ కారులు బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారీ, బంటారం సుధాకర్, సంతోష్‌గౌడ్, రాజన్‌గౌడ్, టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, ఉద్యమకారులు శ్రావణ్ గౌడ్, ప్రకాష్ గౌడ్, జిలాని, టీఆర్ఎస్‌వీ నాయకులు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు చొరవ చూపండి: టీజేఎస్ వినతి
తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్‌ను తెలంగాణ జన సమితి తాండూరు ఇంచార్జ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్ కోరారు. తాండూరుకు వచ్చిన శుభప్రద్ పటేల్‌ను సోమశేకర్ పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణలో వీరశైవులను పదేళ్ల క్రితమే బీసీ డీ గ్రూపులో చేర్చడం జరిగిందని, కేంద్రం ఓబీసీలుగా గుర్తించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. వీరశైవులను కేంద్రం బీసీలుగా గుర్తించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్‌లలో స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కోరారు.