మూడో ముప్పు తగ్గితే అన్నీ రైల్లు నడిపిస్తాం
– రైల్వేస్టేషన్ల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
– విజయవంతంగా టీకాస్ ప్రయోగాలు
– రైల్వే జీఎం గజానన్ మాల్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: కరోనా మూడో ముప్పు తగ్గితే త్వరలోనే అన్ని రైళ్లను నడిపిస్తామని దక్షిణమద్య రైల్వే శాఖ జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం మల్కోడ్, సేడం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలోని సీసీఐ, ఐసీఎల్ సిమెంట్ కర్మాగారాల రైల్వే ట్రాక్ నిర్వహణ వ్యవహరాలను జీఎం గజానన్ మాల్య సమీక్షించారు. తాండూరు రైల్వేస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులతో కలిసి రైల్వేశాఖలోని పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు కొత్త ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టుల వేగవంతంపై అలోచించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
కరోనా తగ్గుముఖం తరువాత 90 శాతం ఎక్స్ ప్రెస్, 40 శాతం ప్యాసింజర్ రైళ్లను మాత్రమే నడిపిస్తున్నామని వివరించారు. కరోనా మూడో ముప్పు రాకుంటే రెండు, మూడు నెలల్లో అన్ని రైళ్లను నడిపిస్తామన్నారు. అదేవిధంగా ప్రయాణికుల నుంచి కూడ డిమాండ్ పెరిగిందన్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో ఫుట్ ఫాత్‌లు, లిఫ్టులు వంతి సదుపాయాలతో సుందరీకరణపై దృష్టి సారించినట్లు తెలిపారు. నేరాల నియంత్రణ కోసం పెద్ద పెద్ద రైల్వేస్టేషన్లలో అమర్చిన సీసీ కెమెరాల వ్యవస్థను చిన్న చిన్న రైల్వేస్టేషన్లలో కూడ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు పలు రైల్వేస్టేషన్ల పరిధిలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ గేట్లను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఒకే ట్రాక్‌పై ఎదరురెదురుగా వచ్చే రైల్లు ఢీకొట్టకుండా దక్షిణ మద్య రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టీకాస్(ట్రైన్ కొలిజన్ అవైండింగ్ సిస్టమ్) ప్రయోగాలు 540 కిలోమీటర్ల పరిధిలో విజవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
వచ్చే రెండు, మూడు నెలల్లో 1200 కిలో మీటర్ల పరిధిలో చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఆ తరువాత మిగతా ప్రాంతాల్లో చేపట్టిన అనంతరం దేశ వ్యాప్తంగా అమలు చేయవచ్చన్నారు. బుల్లెట్ ట్రైన్ సర్వే కొనసాగుతుందని, ఈ ప్రక్రియ తమ పరిధిలో లేదన్నారు. జీఎం వెంట డీఆర్ఎం ఏకే గుప్త, రైల్వే ప్రతినిధులు లక్ష్మీనారాయణ, పాండు బస్వరాజు తదితరులు ఉన్నారు.
