నన్ను కొట్టారు..!
– డీఎస్పీ ఆఫీసుకు వచ్చిన బాధితుడు
– కానిస్టేబుల్ దాడి చేశారని ఆరోపణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ తనను కొట్టారంటూ ఓ బాధితుడు తాండూరు డీఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. తనకు న్యాయం చేయాలంటూ హల్ చల్ చేశాడు. కుటుంబంతో కలిసి కార్యాలయం వద్ద కూర్చున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుడి కథనం ఇలా ఉంది. తాండూరు మండలం చెంగోలు గ్రామానికి చెందిన నర్సింలు కుటుంబ సభ్యులతో కలిసి యాలల మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. మార్గ మద్యలోని బాగాయిపల్లి గేట్ సమీపంలోకి రాగానే యాలాల పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు నర్సింలుని ఆపి బైక్ తాళం లాక్కున్నారు.
తన బైక్ తాళం ఇవ్వాలని కోరగా ఓ కానిస్టేబుల్ నర్సింలు బైక్ ను తీసేయడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కింద పడిపోయారు. బైకుపై ఉన్న చిన్నారికి కూడా గాయాలయ్యాయి. ఎందుకు తోసారని కానిస్టేబుల్ ను నర్సింలు ప్రశ్నించగా వారి మద్య వాగ్వివాదం జరిగింది. ఈ గొడవలోనే తన తలపై కానిస్టేబుల్ రాయితో కొట్టారని నర్సింలు ఆరోపించాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతోనే నర్సింలు తాండూరు డీఎస్పీ కార్యాలయానికి కుటుంబంతో కలిసి వచ్చాడు. దాడి చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని హల్ చల్ చేశాడు.

మరోవైపు కానిస్టేబుల్ నర్సింలుపై దాడి చేయక ముందు బాగాయిపల్లి వద్ద కొందరు వ్యక్తుల మద్య ఘర్షణ జరిగిందని, ఈక్రమంలో పోలీసు కానిస్టేబుళ్లు వారిని అదుపు చేసే క్రమంలో నర్సింలుతో వాగ్వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. డీఎస్పీ, సీఐలను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఇతర కారణాల వల్ల అందుబాటులోకి రాలేదు. కొద్ది సేపటి తరువాత బాధితుడు నర్సింలు జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు.

ఇదికూడా చదవండి…

