కాంట్రాక్టర్లకు కాసుల దాసోహం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంట్రాక్టర్లకు కాసుల దాసోహం..!
– బల్దియాలో ఎడా పెడా నిధుల చెల్లింపులు
– వివాదాస్పదంగా మున్సిపల్ పాలన
– ప్రేక్షక పాత్రలో పాలకవర్గం…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపాల్టీలో ఇష్టారాజ్యం నెలకొంది. ఉన్నత స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపులపై జోరుగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరమ్మత్తుల పేరుతో అవినీతి అధికారులు కాంట్రాక్టర్లకు నిధులను దాసోహం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మున్సిపల్‌లో పాలకవర్గం ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్రకే పరిమన్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

మరమ్మత్తుల్లోనే మర్మం
కొన్ని రోజులుగా తాండూరు మున్సిపల్‌ అధికారుల అవినీతీ భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కొత్త మున్సిపల్ ప్రారంభం సమయంలో కార్యాలయ ప్రాంగణంలో రూ. 34 లక్షలతో పేపర్ టైల్స్ నిర్మాణం చేశారు. కాని రెండేళ్లకే టైల్స్‌ గుంతలోకి కూరుకుపోయాయి. ఆఫీసు మేయిన్‌ డోరు ముందే ఈ గుంతలు ఏర్పడ్డాయి. గతంలోనే పనులు నాణ్యతంగా లేవని బిల్లులు నిలిపివేయగా.. కొద్ది రోజుల ముందే దీనికి సంబంధించిన నిధులను కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు ప్రచారం ఉంది. చేసిన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు గుంతలకు మళ్లీ మరమ్మత్తులు చేయించారు.

ఇదే మున్సిపల్‌కు చెందిన ట్రాక్టర్లు, ఆటోల మరమ్మత్తుల విషయంలో భారీగా అవినీతి జరిగినట్లు వినిపిస్తోంది. ఆటోలు, ట్రాక్టర్లకు తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేయించి కాంట్రాక్టర్‌కు భారీగా నిధులు చెల్లించినట్లు సమాచారం. అదికూడా నిబంధనలకు విరుద్దంగా చెల్లింపు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

పాలకవర్గం ప్రేక్షక పాత్రేనా..?
తాండూరు మున్సిపల్‌ పాలకవర్గం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యిందా అనే విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో పలు చెల్లింపులకు సంబంధించి కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందులో ఏమైనా అభ్యంతరం ఉంటే అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం పాలకవర్గానికి ఉంటుంది. మున్సిపల్‌లో కౌన్సిల్ తీర్మానం లేకుండానే చెల్లింపులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

హామి లేకుండా రూ. 1 కోటి లోన్..!