ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు
– తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
– డివిజన్ స్థాయిలో నాలుగు దరఖాస్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు అందాయి.
ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత వారం నుంచి డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత వారం 13 ఫిర్యాదులు అందగా ఇందులో 8 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని, మిగతా ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయని వెల్లడించారు. సోమవారం నాలుగు ఫిర్యాదులు అందగా ఇందులో 3 ఎంపీడీఓ పరిధి, 1 రెవెన్యూ పరిధికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. వీటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అదేవిధంగా ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని ఫిర్యాదు దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, ఆర్అండ్ బి, ఇరిగేషన్, అటవి శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

