చేతగాని సర్కారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చేతగాని సర్కారు..!
– ఆరు గ్యారెంటీలతో గారడి
– రైతులకు, నిరుద్యోగులకు మోసం
– తాండూరులో సెటిల్మెంట్ మాఫీయా
– ఎమ్మెల్యే ఇచ్చిన హామిలను నెరవేర్చాలి
– మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలన చేస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తాండూరు పట్టణానికి వచ్చిన ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల ముందు ఎగిరిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత పట్టించుకోలేని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోవడమే కాకుండా నిరుద్యోగులపై దాడులకు పాల్పడిందని విమర్శించారు.

నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ తరుపున అండగా ఉంటామన్నారు. ఉద్యోగ పోరాటానికి సిద్దమవుతామన్నారు. అదేవిధంగా డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి 8 నెలలైనా అమలు చేయలేక పోయిందన్నారు. ఫించన్‌ సక్రమంగా అందించడం లేదని, కరెంటు కోతలు విధిస్తూ ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. బీఆర్ఎస్‌ హాయాంలో బంగారు తెలంగాణగా ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు.

సాండ్, సెటిల్మెంట్ మాఫీయా
తాండూరులో కూడా పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొత్త కొత్త పద్దతులను అవలంబిస్తున్నారని అన్నారు. సాండ్ మాఫీయా, సెటిల్‌ మెంట్ మాఫీయాలా మారిందని అన్నారు. ఈ విధానాలను ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే గెలిచిన తరువాత ఏ ఒక్క కొత్త పనులు తీసుకవచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. చిలుకవాగుకు రూ. 16 కోట్లు కేటాయిస్తే పనులు చేపట్టలేకపోయారని విమర్శించారు. గతంలో తాను తీసుకవచ్చిన 1600ల కోట్ల పనులకే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే దృష్టి సారించాలన్నారు. ఇచ్చిన హామిలను నెరవేర్చకపోతే ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా
అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా తాండూరుకు రాలేకపోయానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా తానే ఉంటానని, పార్టీని వీడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి.శ్రీశైల్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), నాయకులు శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

పైలెట్ కోసం ప్రార్థనలు..!