చదువుతోనే ఉన్నత స్థాయి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చదువుతోనే ఉన్నత స్థాయి..!
– ఆదివాసీల అభివృద్దికి ప్రాధాన్యం
– సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
– ఆదివాసీలకు కుల, ఆధార్‌ పత్రాల కల్పనకు చర్యలు
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌
– పెద్దేముల్ చైతన్య నగర్‌లో ఆదివాసీల దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యతోనే భవిష్యత్తు నిర్మాణం మారుతుందని, అందరు చదువుకుంటేనే ఉన్నత స్థాయిని అధిరోహిస్తారని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం చైతన్య నగర్‌లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, కొమరం భీమ్, చెంచులక్ష్మిల ఫోటోలకు పూల మాలలు వేశారు. అనంతరం ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకుపచ్చ జెండాను ఎగరవేశారు. బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముందుగా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే చదువు ఒకటే మూలమని కలెక్టర్ అన్నారు. చదువు ద్వారా ఎంతటి స్థాయినైన అధిగమించ వచ్చని నిరూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పూర్తిగా తీసుకొని విద్యను అభ్యసించాలని కలెక్టర్ సూచించారు.

ముందు చూపుతోనే రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి విద్యలో, ఉద్యోగాల్లో అణగారిన ప్రజల ఎదుగుదలకు అంబేద్కర్ కృషి ఎనలేనిదని కలెక్టర్ అన్నారు. బడీడు పిల్లలు అందరూ పాఠశాలకు వెళ్లే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. సమాజంలో సంస్కృతి, సంస్కారాలతో పాటు స్వాభిమానంతో బ్రతకాలని కలెక్టర్ తెలిపారు. కష్ట దుఃఖాలు ఎన్ని ఉన్నా వాటిని అధిగమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఆదివాసీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జన్‌మాన్ పథకం ద్వారా గ్రామంలో కావలసిన సదుపాయాలను కల్పించుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి ఇంటికి విద్యుత్తు, మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇంటింటి సర్వే నిర్వహించి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కులము ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పోడు భూముల సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే పరిష్కార దిశగా కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. విప్ప చెట్లు కల్పవృక్షం లాంటివని ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వచ్చినట్లయితే వారికి అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అంతకుముందు కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన పాటలు, చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ వేధికపై ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ లను, సంఘ నాయకులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ పల్వన్ కుమార్, తహసిల్దార్ కిషన్ నాయక్ , ఎంపీడీవో జానప్ప, ఏడి మైన్స్ సత్యనారాయణ, ఎంపీఓ రతన్ సింగ్, డిఎల్ పిఓ శంకర్ నాయక్, ఆదివాసి సంఘం రాష్ట్ర నాయకులు అంజయ్య, హనుమంతు, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బస్సు ఆపలేదని గుస్సా..!