కౌలు పొలంలో గంజాయి సాగు..!
– పసుపు పంటలో మొక్కల పెంపకం
– మొక్కలను స్వాదీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు
– వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో వెలుగులోకి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో గంజాయి సాగు గుట్టుగా సాగుతోంది. గత కొన్ని రోజుల క్రితం కోడంగల్ మండలంలో గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో గంజాయి సాగును గుర్తించారు. తాజాగా శుక్రవారం బంట్వారం మండలంలో కూడ గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపి మొక్కలను స్వాదీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో సర్వేనెంబర్ 62/2/2లఓ గ్రామానికి చెందిన పడుగుల శంకరప్పకు చెందిన పొలాన్ని అదే గ్రామానికి చెందిన పసుపుల చెన్నప్ప కౌలు తీసుకున్నారు. పొలంలో పసుపు పంటతో పాటు అంతరపంటగా గంజాయి వేసి గుట్టుగా సాగుచేస్తున్నారు. గంజాయి మొక్కలు ఉన్నాయని గుర్తించిన కొందరు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సిఐ శ్రీలత శుక్రవారం సిబ్బందితో కలిసి పొలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పొలంలో సాగుచేస్తున్న 31 గంజాయి మొక్కలు స్వాదినం చేసుకు చేసుకున్నారు. దీని బరువు 12 కేజీలు ఉండొచని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగుచేస్తే సమాచారం అందించాలని సూచించారు.
