గుట్కా, గంజాయి కట్టడే లక్ష్యం
– తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ
– 18 మందిపై కేసులు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో గుట్కా, గంజాయి కట్టడే లక్ష్యమని డీఎస్పీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టణంలోని పలు కిరాణా, పాన్‌షాపులలో దాడులు చేశారు. ఉదయం నుంచి మొత్తం 50 దుకాణాలు, పాన్‌షాపులలో గుట్కా, గంజాయి నిల్వలపై ఆరా తీశారు. ఇందులో 18 షాపుల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాండూరులో నిషేధిత గుట్కా, గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వాటిని కట్టడి చేయడమే లక్ష్యంగా దృష్టిసారించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా.. ఎవరైనా నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మరోవైపు గుట్కా ప్యాకెట్లు లభ్యమైన 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో పట్టణ ఎస్ఐ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
