మెగా రక్తదాన శిబిరం సూపర్ సక్సెస్
– 152 మంది నుంచి రక్తదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా తాండూరు సబ్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం సూపర్ సక్సెస్ అయ్యింది. మంగళవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిలు దగ్గరుండి ఏర్పాట్లను చేశారు. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
రక్తనిధి కేంద్ర సిబ్బంది రక్తదాన శిబిరంలో సేవలందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ రక్తదాన శిబిరంలో 152 మంది పాల్గొని రక్తదానం చేశారు. తాండూరు పట్టణంతో పాటు కరణ్‌కోట్, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ పోలీసు సిబ్బంది, ఆయా మండలాల నుంచి ప్రజలు, యువత భారీలో సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
అభినందించిన జిల్లా ఎస్పీ నారాయణ
తాండూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ముగింపుకు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రక్తదానం చేసిన పోలీసు సిబ్బంది, ప్రజలు, యువతను అభినందించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంస గుర్తింపు పత్రాలను అందజేశారు.
అనంతరం ఎస్పీ నారాయణ మాట్లాడుతూ కరోనా సమయంలో రక్తనిల్వలు తగ్గిపోయాయని అన్నారు. కొవిడ్ భయంలో రక్తం ఇచ్చేందుకు, తీసుకునేందుకు ఎవ్వరు ముందుకు రాలేదన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పోలీసు శాఖ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన మెగా రక్తదాన శిబిరానికి స్పందించి రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారందరిని అభింనందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్, వివిధ పోలీస్టేషన్ల ఎస్ఐలు ఏడుకొండలు, గిరి, రమేష్, సురేష్, ట్రైనీ ఎస్ఐలు, ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు వివిధ పార్టీల యువనాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


